Y. S. Jagan Mohan Reddy ఆధ్వర్యంలో తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు.
జగన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొని ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉండాలని సూచించారు.
“స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే.. వాళ్లే భవిష్యత్తులో జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలుస్తారు” అని జగన్ పేర్కొన్నారు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే దానిని తీవ్రంగా పరిగణిస్తానని, అది సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైఫల్యంగా భావిస్తానని నేతలకు హెచ్చరించారు.
ప్రజల్లో చురుగ్గా తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని గుర్తించి ఎన్నికలకు సిద్ధం చేయాలని నాయకులకు సూచించారు. అలాగే కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ బుక్‌లెట్ ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, N. Chandrababu Naidu పాలనలో జరిగిన మోసాలు, వెన్నుపోట్లపై ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని ఆయన పేర్కొన్నారు.