నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

లోకేశ్ తన సందేశంలో.. ప్రపంచానికి తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొన్నారు.

అణగారిన వర్గాలకు అండగా నిలిచి, మహిళా సాధికారతకు బాటలు వేసిన మహానేతగా ఎన్టీఆర్‌ను గుర్తు చేశారు. ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారని తెలిపారు. సంక్షేమానికి చిరునామాగా నిలిచిన ఎన్టీఆర్ కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

“తాతా.. మీరే తెలుగు ప్రజల కీర్తి.. మీరే మాకు నిత్య నూతన స్ఫూర్తి” అంటూ లోకేశ్ భావోద్వేగంగా నివాళులు అర్పించారు.