“53 వేల ఓట్లతో ఓడినా బుద్ధి రాలేదు.. చంద్రబాబు, మోదీ స్థాయిపై మాట్లాడే అర్హత నానికేంటి?” అంటూ తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి, వైసీపీ నేత Kodali Naniపై గుడివాడ ఎమ్మెల్యే Venigandla Ramu తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం N. Chandrababu Naidu బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని రాజకీయాల గురించి మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితిలో కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేడని, ఇది తన చాలెంజ్ అని వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో ఓడించినా ఇంకా నానికి బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా ముందు మాట్లాడడం కాదని.. దమ్ముంటే గుడివాడకు రావాలని సవాల్ విసిరారు.

గుడివాడ ప్రజలకు ఏమైనా సేవ చేసి చూపించాలని సూచించిన ఎమ్మెల్యే.. “గుడివాడలో నాని సీటు ఖాళీ అయిపోయింది.. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా దండగ” అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు కొడాలి నానిని చాలాకాలం క్రితమే మరిచిపోయారని వ్యాఖ్యానించారు.

అలాగే మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddyపై కూడా వెనిగండ్ల రాము విమర్శలు చేశారు. “పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని జగన్ ఎక్కడ.. రాజకీయ పరిజ్ఞానం ఉన్న చంద్రబాబు, Narendra Modi ఎక్కడ” అంటూ ప్రశ్నించారు.

అమరావతి విషయంలో మాట మార్చిన వ్యక్తి జగన్ అని, అలాంటి వ్యక్తి మాట మీద నిలబడే నాయకుడు ఎలా అవుతాడని నిలదీశారు. “ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తా అన్నావ్.. ఎప్పుడు తుడుస్తావో చెప్పాలి” అంటూ కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“వైసీపీ నాయకులు సోషల్ మీడియా రీల్స్ కోసం మాట్లాడటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. నువ్వు గుడివాడలో యాక్టివ్ అవ్వటమే మాకు కావాలి.. రా క్షేత్రస్థాయిలో తేల్చుకుందాం” అంటూ వెనిగండ్ల రాము సవాల్ విసిరారు.