ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ స్థానాల భర్తీ కోసం భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు జూన్ 18న మొత్తం 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండగా, పదవీకాలం పూర్తికాకముందే ఖాళీ అయిన మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొత్తం 27 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.
అనంతరం జూన్ 18న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూన్ 20 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఓటు హక్కు వినియోగిస్తారు. రాష్ట్రాల వారీగా శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాలను బట్టి అభ్యర్థుల విజయావకాశాలు నిర్ణయించబడతాయి. దీంతో ఈ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.